
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్: ‘‘కేంద్రంలోని బీజేపీ పాలన కేవలం అంబాని-ఆదానీల కోసం మాత్రమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు.. దేశ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.. కొత్తగా కడుతున్న సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ కొబ్బరికాయ కొడుతుంది..’’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ నూతన కమిటీ వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో, ప్రజల్లో నూతన ఉత్తేజం వచ్చిందని.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు పార్లమెంట్ వీడియో క్లిప్ తీస్తే కొట్లాడింది ఎవరో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈనెల 7వ తేదీన పీసీసీ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనెల 7న నభూతో నభవిష్యత్ అన్నట్లు కొత్త కమిటీ బాధ్యతల స్వీకారం
తెలంగాణ కాంగ్రెస్ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ ఈనెల 7వ తేదీన జంట నగరాల్లో నభూతో నభవిష్యత్ అన్నట్లు జరుగుతుందని అంజన్ కుమార్ యాదవ్ వెల్లడించారు. టీపీసీసీ నూతన కమిటీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆరెస్ కు వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రజలు దొంగల లాగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘వంద నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతా అన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి..? దళితుణ్ణి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు.. మాజీ హోమ్ మంత్రి నాయిని ని టీఆరెస్ చంపింది.. ’’ అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మానసికంగా చంపుతారు ... చస్తే పాడేలు మోస్తరని ఆయన ఆరోపించారు. ఆంధ్రా కాలేజీల దగ్గర కలెక్షన్స్ పేరుతో కేసీఆర్ వేల కోట్లు కేసీఆర్ సంపాదిస్తున్నాడని, ఆంధ్రా వ్యక్తులు తెలంగాణలో సినిమా తీయాలంటే టీఆర్ ఎస్ కు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో హిందూ- మున్సిపల్ డ్రామా ఆడి ప్రజలను మోసం చేశారుని ఆయన విమర్శించారు.
కరోనా సమయంలో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ నేతలే
కరోనా సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేయలేరనే విషయం గుర్తుంచుకోవాలని.. పదేళ్లుగా నేను ఎంపీగా ఉన్నా.. ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే-ఎంపీ అయితే వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ దేశానికి, తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ వల్ల బంగారు తెలంగాణ కాదు శవాల తెలంగాణ తయారు అయిందని, వైఎస్సార్ ఆ మాత్రం అభివృద్ధి చేశారు కాబట్టే కేసీఆర్ ఇవ్వాళ వేలకోట్ల సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు. స్వర్గీయ పీవీ పేరుతో కేసీఆర్ తెలంగాణాలో నాటకం చేస్తున్నాడని.. పీవీకీ కేసీఆర్ కు సంబంధం లేదన్నారు. యాదవులు అంటేనే మొదటి నుంచి ధనికులు అని, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేందుకే గొర్రెల పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గొర్రెల పేరుతో కూడా టీఆరెస్ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ రోడ్లన్నీ 7వ తేదీన గాంధీ భవన్ కే దారితీస్తాయని.. పోలీసుల అనుమతి ఇవ్వక తప్పదని ఆయన పేర్కొన్నారు.